తెలుగు డీజీపీలు… ఎందుకిలా

హైదరాబాద్, ఫిబ్రవరి 21: ఇంచుమించు ఒకే స‌మ‌యంలో రెండు ప‌రిణామాలు. అవి కూడా రెండు తెలుగు రాష్ట్రాల డీజీపీల విష‌యంలో జ‌ర‌గ‌డం కాక‌తాళీయం. ఏపీ డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్‌పై అనూహ్యంగా వేటు వేసింది ఏపీ స‌ర్కారు. ఎక్క‌డా పోస్టింగ్ ఇవ్వ‌కుండా.. డీజీపీ ప‌ద‌వి నుంచి త‌ప్పించి అవ‌మానించింది. ఆ త‌ర్వాత ఆయ‌న‌తో బ‌ల‌వంతంగా రిటైర్మెంట్ ప్ర‌క‌టించేలా.. ఏపీపీఎస్సీ ఛైర్మ‌న్‌గా నియ‌మించింది. అలా, ఏపీలో డీజీపీ ఎపిసోడ్ తీవ్ర చ‌ర్చ‌ణీయాంశం అవుతుండ‌గా.. ఇదే స‌మ‌యంలో తెలంగాణ డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి సెల‌వుల్లో వెళ్ల‌డంతో అంతా ఒక్కసారిగా ఉలిక్కిప‌డ్డారు. డీజీపీ స‌వాంగ్ సీఎం జ‌గ‌న్‌రెడ్డికి న‌మ్మిన‌బంటులా ప‌ని చేశార‌ని అంటారు. ఇక‌, తెలంగాణ డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి సైతం సీఎం కేసీఆర్ న‌మ్మ‌కాన్ని ఒప్పు చేయ‌కుండా ప‌ని చేస్తున్నారు. అలాంటిది.. స‌డెన్‌గా డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి సెల‌వుల్లో ఎందుకు వెళ్లార‌ని అంతా ఆశ్చ‌ర్య‌పోయారు. కేసీఆర్‌తో విభేదాలు వ‌చ్చాయా? అలిగి సెల‌వు పెట్టారా? ఇలా అనేక అనుమానాలు. అస‌లు విష‌యం ఏంట‌ని ఆరా తీస్తే.. అప్పుడు తెలిసింది కార‌ణ‌మేంటో.

తెలంగాణ రాష్ట్ర డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి అనారోగ్య కార‌ణాల‌తో సెలవులో వెళ్లారు. డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆరోగ్య కారణాలతో సెలవు పెట్టటం ఇదే మొద‌టిసారి. ఈ నెల18 నుంచి మార్చి 4 వరకు ఆయన సెలవులో ఉండనున్నారు. ఆయన స్థానంలో గతంలో హైదరాబాద్ సీపీగా.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఏసీబీ డీజీగా వ్యవహరిస్తున్న అంజనీకుమార్ కు పూర్తి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.ఒకవైపు ఏపీ డీజీపీని అనూహ్యంగా మార్చటం.. తదనంతరం చోటు చేసుకున్న పరిణామాలు ఉత్కంఠ‌గా మారితే.. ఇలాంటి సమయంలోనే.. తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి సెలవుపై వెళ్లటంతో.. కారణం ఏమిటి? అసలేం జరిగింది? అంటూ అంతా ఆరా తీయ‌డం మొద‌లుపెట్టారు. అయితే, గురువారం రాత్రి డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి త‌న ఇంట్లోని బాత్రూంలో జారి పడినట్టుగా తెలిసింది. ఆ ప్ర‌మాదంలో ఆయన ఎడమ చేయికి ఫ్యాక్చర్ అయినట్టు సమాచారం. విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించగా.. 15 రోజుల పాటు మెడికల్ లీవ్‌ తీసుకున్నారు. డీజీపీ మ‌హేంద‌ర్‌రెడ్డి సెల‌వుల‌కు రీజ‌న్ తెలీడంతో.. హ‌మ్మ‌య్య‌.. ఏపీలా కాలేదులేన‌ని అంతా రిలాక్స్‌ అయ్యారు.

Leave A Reply

Your email address will not be published.