లగేజీ చార్జీలను భారీగా పెంచేసిన టీఎస్ ఆర్టీసీ

తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు ఇది కొంత చేదు వార్తే. దాదాపు 20 ఏళ్లపాటు స్థిరంగా ఉన్న లగేజీ చార్జీలను అమాంతం పెంచేసింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం నుంచే కొత్త చార్జీలు అమల్లోకి రానున్నాయి. లగేజీ చార్జీల్లో చాలాకాలంగా మార్పు లేకపోవడంతో వీటిని పెంచాలని ఇటీవల జరిగిన టాస్క్‌ఫోర్స్ సమావేశంలో నిర్ణయించారు. ఈ నేపథ్యంలో తాజాగా వాటిని పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. లగేజీ చార్జీలను పెంచడం 2002 తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. డీజిల్ ధరలతోపాటు మానవ వనరుల వ్యయాలు పెరగడంతో చార్జీలు పెంచక తప్పలేదని ఆర్టీసీ పేర్కొంది. ఆర్టీసీ కార్గో సేవలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఆ చార్జీలతో సమానంగా లగేజీ చార్జీలను పెంచినట్టు తెలిపింది.

ఆర్టీసీ తాజా ఉత్తర్వుల ప్రకారం.. 50 కేజీల వరకు ఉచిత లగేజీకి అవకాశం ఉంది. ఆ తర్వాత ఒక్క కిలో అదనంగా పెరిగినా 25 కేజీల వరకు ఒక యూనిట్‌గా పరిగణించి పూర్తి చార్జీ వసూలు చేస్తారు. పెయిడ్‌ లగేజీలో 25 కిలోలు దాటితే మరో యూనిట్‌గా పరిగణిస్తారు. ప్రస్తుతం పల్లెవెలుగు బస్సుల్లో 25 కిలోమీటర్ల దూరం వరకు రూపాయి వసూలు చేస్తున్నారు. ఇకపై ఇది రూ. 20కి పెరగనుంది. 26-50 కిలోమీటర్ల మధ్య ఇప్పటి వరకు రెండు రూపాయలు వసూలు చేస్తుండగా దానిని రూ.40కి పెంచారు. 51-75 కిలోమీటర్ల దూరానికి ఉన్న మూడు రూపాయల చార్జీని రూ. 60కి పెంచగా, 76-100 కిలోమీటర్ల మధ్య దూరానికి ఉన్న రూ. 4 చార్జీని రూ. 70కి పెంచారు. అలాగే, ఒక్కో ప్రయాణికుడికి 100 కిలోల వరకు మాత్రమే లగేజీ అనుమతి ఉంటుంది.
TSRTC, Luggage Charge, Telangana

Leave A Reply

Your email address will not be published.