గులాబీ బాస్ ఇమేజ్ పెంచే పనిలో పీకే

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష శిబిరంలో ప్రయత్నం జరుగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీపై విరుచుకుపడటం, ఆయన ముంబై పర్యటన, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరేతో గంటసేపు లంచ్ మీటింగ్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్తో మాటా మంతీ జరిపారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ కేసీఆర్ జాతీయ ఆకాంక్షలు ఎంతవరకు ఫలిస్తాయి? ప్రాంతీయ పార్టీలు ఏకం కావటం సాధ్యమా?జాతీయ రాజకీయాల్లో పెద్దన్న పాత్ర పోషించాలన్న తన లక్ష్యాన్ని కేసీఆర్ ఏనాడూ దాచుకోలేదు. కానీ, గతంలో ఎన్నడూ ప్రధానిపై మోడీపై ఇప్పుడు చేస్తున్న స్థాయిలో మాటల దాడి చేయలేదు. నిజానికి, గతంలో రాజ్యసభలో ఎన్డీఏకి మెజారిటీ లేనప్పుడు తెలంగాణ రాష్ట్రీయ సమితి తరచూ ప్రభుత్వానికి మద్దతిచ్చింది. కానీ ఇప్పుడు ఆ స్నేహం భావం లేదు. పైగా, మోడీది చేతకాని ప్రభుత్వం అంటూ వెళ్లిన ప్రతి సభలో విరుచుకుపడుతున్నారు. అలాగే, ఇటీవల శ్రీ రామానుజాచార్యుల విగ్రహ ఆవిష్కరించడానికి మోడీ రాష్ట్రానికి వచ్చినపుడు సీఎం ఆయన వెంటలేరు.ఎందుకు అలా చేశారో ప్రత్యేకించి చెప్పావలసిన అవసరం లేదు. జాతీయ స్థాయిలో మోడీకి వ్యతిరేకంగా కేసీఆర్ కీలక భూమిక పోషించడానికి సిద్ధమయ్యారని అర్థమవుతోంది.

ప్రతిపక్షాలను ఒక్కటి చేసే శక్తిగా ఎదగటానికి ఆయన బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో కూడా పోటీ పడుతున్నారు.రాష్ట్రాల పట్ల కేంద్రం అనుసరిస్తున్న తీరుపై మమతా బెనర్జీ ఇటీవల కేసీఆర్తో టెలిఫోన్లో చర్చించారు. రాజకీయ ప్రత్యర్థులపై కేంద్ర సంస్థలను ప్రయోగిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడటాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష ముఖ్యమంత్రులు సమావేశం కావాల్సిన అవసరంపై కూడా ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించారు.నిజానికి, కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తున్నారంటూ విపక్షం దుమ్మెత్తిపోయడం ఇదే కొత్త కాదు. 2024లో మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చే ఫ్రేమ్వర్క్ గురించి చర్చించడమే త్వరలో జరిగే విపక్ష సీఎంల సమావేశం అసలు ఉద్దేశం.ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇటీవల బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ను కలవటం విపక్షాల వ్యూహంలో భాగమే అంటున్నారు. కొంత కాలంగా జనతాదళ్ (యు), బీజేపీ మధ్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. ఉత్తర ప్రదేశ్, మణిపూర్ రెండింటిలో బీజేపీకి వ్యతిరేకంగా జేడీ (యూ) అభ్యర్థులను నిలబెట్టటం అందుకు ఒక ఉదాహరణ. అలాగే ఆ పార్టీ నేతలు కాషాయ సంస్థల కార్యక్రమాలు, విధానాలపై విషం చిమ్ముతున్నారు. మరోవైపు, నితీష్ కుమార్ మద్య నిషేధ విధానాన్ని బీహార్ బీజేపీ నాయకత్వం తీవ్రంగా విమర్శించింది.ఇంతకూ నితీష్ మదిలో ఏముంది అనే విషయం యూపీ ఎన్నికల ఫలితాల తర్వాత కానీ తెలియందటున్నారు ఆయన సన్నిహితులు.

అంతేకాదు, ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ బీజేపీ వ్యతిరేక ఫ్రంట్కు అనుసరించే ఎత్తుగడను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. కాంగ్రెస్ పంజాబ్ను నిలబెట్టుకోగలిగి, ఉత్తరాఖండ్, గోవాలను గెలుచుకోగలిగితే ప్రతిపక్ష శిభిరం అంత సులువుగా దానిని పక్కన పెట్టలేదు. కానీ, కాంగ్రెస్ వారితో కలిసి వెళ్లేది కూడా అనుమానమే. హస్తం పార్టీ ఒంటరి దారినే ఎంచుకుంటుందని మమతా బెనర్జీ గట్టిగా నమ్ముతున్నారు. ఈ పరిస్థితుల్లో రాహుల్ గాంధీతో కలిసి నడవాలా వద్దా అనేది శరద్ పవార్, మమతా బెనర్జీ , కేసీఆర్ ముందున్న మిలియన్ డాలర్ల ప్రశ్న.మరో వైపు, వచ్చే జూన్లో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికలు విపక్షాల ఐక్యతకు మొదటి పరీక్ష కానుంది. కేసీఆర్ ప్రస్తుత హడావుడి అంతా రాష్ట్రపతి ఎన్నికల కోసమేననే వార్తలు వినిపిస్తున్నాయి. 2024 ఎన్నికలకు బీజేపీ వ్యతిరేక పునాది బలపడాలంటే రాష్ట్రపతి ఎన్నికలలో బీజేపీని ఓడించాలన్నది కేసీఆర్-ప్రశాంత్ కిశోర్ గేమ్ ప్లాన్. ఇప్పటికే ఈ ఇరువు రాష్ట్రపతి పదవికి అనువైన అభ్యర్థిని వెతుకుతున్నట్టు సమాచారం.

ప్రస్తుతం నితీష్ కుమార్లపై ప్రధానంగా ఫోకస్ పెట్టినట్టు సమాచారం. విపక్ష నేతలు, ముఖ్యంగా, కేసీఆర్ ఈ వ్యూహంపై కసరత్తు చేస్తున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.ఇటీవల ఢిల్లీలో నితీష్ కుమార్, ప్రశాంత్ కిశోర్ రహస్యం భేటీ ఉద్దేశం కూడా ఇదే అని అంటున్నారు. ప్రశాంత్ కిశోర్ టీమ్ ప్రస్తుతం తెలంగాణా ఎన్నికల్లో పనిచేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో రాజకీయ పరిస్థితిని అంచనా వేస్తోంది. పీకే గతంలో వైఎస్ జగన్ కోసం, స్టాలిన్, మమతా బెనర్జీ కోసం పనిచేశారు. ప్రస్తుతం ఆయన కేసీఆర్ నేషనల్ ఇమేజ్ పెంచే పనిలో నిమగ్నమయ్యారని తెలుస్తోంది. జాతీయ రాజకీయాల్లో బిజీ అయ్యేందుకే కేసీఆర్ రాష్ట్ర ఎన్నికల బాధ్యతను పీకే టీంకు అప్పగించారనే వాదన కూడా వినిపిస్తోంది. గతంలో ప్రాంతీయ పార్టీల పోకడలకు భిన్నంగా ఈ సారి సరికొత్త ఎత్తుగడలతో బీజేపీ వ్యతిరేక కూటమి ముందుకు సాగాలని కేసీఆర్ ఆశిస్తున్నారు. రాబోయే కొద్ది రోజులలో దీనిపై మరింత స్పష్టత రానుంది.

Leave A Reply

Your email address will not be published.