పోలీస్ స్టేషన్లో పునర్వ్యవస్థీకరణ డిజిపి ఆధ్వర్యంలో నేడు ఉన్నత స్థాయి సమావేశం

హైదరాబాద్‌: రాష్ట్రంలో పోలీస్‌ స్టేషన్ల పునర్‌వ్యవస్థీకరణ జరగనుంది. కొత్తగా ఠాణాల మంజూరుతోపాటు కొన్నింటి పరిధిని మార్చనున్నారు. ప్రజలకు అన్ని విధాలా మరింత చేరువయ్యేందుకు అనువుగా స్టేషన్లను తీర్చిదిద్దనున్నారు. దీనికి సంబంధించి డీజీపీ అంజనీకుమార్‌ ఆధ్వర్యంలో బుధవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 746 పోలీస్‌స్టేషన్లు పనిచేస్తున్నాయి. పోలీసుశాఖను మరింత పటిష్ఠపరిచేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. దీనిలో భాగంగా తెలంగాణ ఏర్పడ్డాక ఇప్పటికే 30వేల మందికిపైగా సిబ్బందిని భర్తీచేయగా తాజాగా మరో 17వేల మంది నియామకానికి ఎంపిక ప్రక్రియ నడుస్తోంది. దీనితోపాటు పెద్దఎత్తున వాహనాలు, దేశానికే తలమానికంగా కమాండ్‌ కంట్రోల్‌ నిర్మాణం, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వెరసి తెలంగాణ పోలీసుశాఖకు జాతీయస్థాయిలో గుర్తింపు లభిస్తోంది. అలానే పోలీసుల సేవలు ప్రజలకు మరింత సమర్థంగా అందేందుకు, ఆపద సమయంలో సత్వరమే వారిని చేరేందుకు వీలుగా కొత్తగా మరిన్ని పోలీస్‌స్టేషన్లు మంజూరు చేయబోతున్నారు.

*రాజధాని పరిధిలో కొత్తగా 22 ఠాణాలు..*

ఒక్క రాజధాని నగరంలోనే హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో 22 కొత్త పోలీస్‌స్టేషన్లు ప్రారంభించనున్నారు. ఇవికాక రాష్ట్రంలో ఇంకో 20 వరకూ కొత్త ఠాణాలు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు ఉన్నాయి. పెరుగుతున్న జనాభా, నేరాల తీవ్రత ఆధారంగా వీటిని పెట్టబోతున్నారు. కొంతకాలంగా రాష్ట్రంలో పట్టణీకరణ వేగం పుంజుకోవటంతో జనసాంద్రత బాగా పెరుగుతోంది. ఉదాహరణకు ఎల్బీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నాగోల్‌, బండ్లగూడ ప్రాంతాల్లో జనావాసాలు, జనాభా అనూహ్యంగా పెరుగుతున్నాయి. అందుకే ఎల్బీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ను విడగొట్టి నాగోల్‌లో కొత్త పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు చేయబోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే సూత్రం అనుసరిస్తున్నారు. జనాభా, నేరాల తీవ్రత ఆధారంగా కొత్త పోలీస్‌స్టేషన్లు రాబోతున్నాయి. ఇవి ఏర్పాటు కాగానే పాతవాటి పరిధి మారుతుంది.

Leave A Reply

Your email address will not be published.