పక్కా ప్రణాళికతోనే చోరీలు

ఆర్మూర్‌: ఆర్మూర్‌లో పది రోజుల క్రితం బంగారు దుకాణాల్లో చోరీకి పాల్పడిన కేసులో నిందితులను అరెస్టు చేసి సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు సీపీ నాగరాజు తెలిపారు. ఆర్మూర్‌ పోలీస్‌ స్టేషనలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ వివరాలను వెల్లడించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన అంజన్‌భునియా ఆర్మూర్‌లో నివాసం ఉంటూ హుస్నాబాద్‌ కాలనీలో బంగారు దుకాణం నడుపుతున్నాడు.అదే షాపులో మాలి యామాజి కొంతకాలంగా పని చేస్తున్నాడు.బంగారు ఆభరణాలను యజమాని భద్రపరిచే చోటును గమనించి చోరీ చేయాలని పథకం పన్నాడు.తన స్నేహితులైన మహారాష్ట్రకు చెందిన ఆటో డ్రైవర్‌ దీపేష్‌రాంకేష్‌ గుప్తా,మరో బాలుడిని ఆర్మూర్‌కు పిలిపించాడు.ముగ్గురు కలిసి డిసెంబర్‌ 30 అర్ధరాత్రి తాను పనిచేసే దుకాణం తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు.అటు తర్వాత జనవరి ఒకటిన పట్టపగలే మరో షాపులో చోరీకి పాల్పడ్డారు.రెండు షాపుల్లో కలిసి 350 గ్రాముల బంగారం,50గ్రాముల వెండి ఆభరణాలను దొంగిలించారు.షాపు యజమాని అంజన్‌ భునియా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించారు. కాగా మంగళవారం దొంగిలించిన సొత్తుతో సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో నిందితులు పారిపోతుండగా ఆర్మూర్‌ ఏసీపీ ప్రభాకర్‌రావు ఆధ్వర్యంలో ఆర్మూర్‌ సీఐ సురేశ్‌బాబు,సిబ్బంది దీపేష్‌ రాంకేష్‌గుప్తాతో పాటు బాలుడిని పట్టుకొని విచారించగా మాలి యామాజీతో కలిసి చోరీకి పాల్పడినట్లు ఒప్పుకున్నారు.ఇద్దరి నుంచి 180 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని ప్రధాన నిందితుడు మాలి యామాజీ తనవంతు వాటా తీసుకొని మహారాష్ట్రకు పారిపోయాడు.ప్రధాన నిందితుడుని సైతం త్వరలో పట్టుకుంటామని సీపీ తెలిపారు.చోరీ కేసును ఛేదించిన సిబ్బందిని అభినందిస్తూ సీఐ సురేశ్‌బాబు,ఎస్సై రాము, ఏఎస్సై షేక్‌ గఫ్పార్‌, కానిస్టేబుళ్లు గంగాప్రసాద్‌, డి.ప్రసాద్‌కు సీపీ నగదు రివార్డులను అందజేశారు. సమావేశంలో ఏసీపీ ప్రభాకర్‌రావు,సీఐ సురేశ్‌బాబు,ఎస్సై రాములు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.