త్వరలో అన్ని జిల్లాల్లో మహిళా భరోసా కేంద్రాలు

హైదరాబాద్‌: ఆపదలో ఉన్న అతివకు అండగా నిలుస్తున్న భరోసా కేంద్రాలను రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయబోతున్నారు. ప్రస్తుతం 12 జిల్లాల్లో వీటి నిర్మాణాలు జరుగుతుండగా ఈ సంవత్సరాంతానికి మిగిలిన జిల్లాకేంద్రాల్లో ఏర్పాటు చేసేందుకు మహిళా భద్రతా విభాగం ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందుకోసం మహిళా శిశు సంక్షేమశాఖ రూ.15 కోట్లు ఇవ్వనుంది.

ఆపదలో ఉన్న బాలికలు, మహిళలు, వివాహితులకు సాయం చేసే ఉద్దేశంతో తెలంగాణ పోలీసుశాఖ ఆధ్వర్యంలోని మహిళా భద్రతా విభాగం భరోసా కేంద్రాలకు రూపకల్పన చేసింది. ఈ తరహా కేంద్రాలు దేశంలో మరెక్కడా లేవు. లైంగిక వేంధింపులు, గృహహింస, టీజింగ్‌ తదితర ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా.. బాధితులకు భరోసా కేంద్రం బాసటగా నిలుస్తుంది. అవసరమైన వైద్య, న్యాయ సౌకర్యాల కల్పన, కౌన్సెలింగ్‌, తాత్కాలికంగా అవసరమైన రక్షణ కల్పించడం, కేసు నమోదు చేయడం భరోసా కేంద్రాల ప్రధాన విధి. మామూలుగా అయితే ఇబ్బందులకు గురైన మహిళలు పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించడం తప్ప మరో మార్గం ఉండేది కాదు. చాలామంది స్టేషన్‌కు వెళ్లేందుకు ఇష్టపడక బాధను దిగమింగుకొని కుమిలిపోయేవారు. ఒకవేళ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లినా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు కానీ వైద్య, న్యాయ సదుపాయాల వంటివి ఎవరికివారు చూసుకోవాల్సిందే. ఇది బాధితులకు ఇబ్బందిగా ఉండేది. ఇలాంటి వారికి అండగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం భరోసా కేంద్రాలకు రూపకల్పన చేసింది. ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండల్లో ఏర్పాటు చేశారు. జుబ్లీహిల్స్‌ గ్యాంగ్‌రేప్‌ కేసులో బాధితురాలి సమస్య భరోసా కేంద్రం వల్లనే బయటకు వచ్చింది. ఈ కేంద్రాలకు ఆదరణ పెరుగుతుండటంతో క్రమంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరిస్తున్నారు. ప్రస్తుతం సిద్దిపేట, మెదక్‌, సంగారెడ్డి, ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, మహబూబాబాద్‌, యాదాద్రి భువనగిరి, శంషాబాద్‌, జోగులాంబ గద్వాల, కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల్లోఈ కేంద్రాల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. త్వరలో అన్ని జిల్లాల్లోనూ అందుబాటులోకి రానున్నాయి.

Leave A Reply

Your email address will not be published.