ప్రాణాలు తీస్తున్న నిరుద్యోగం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: కరోనా మహమ్మారి వేలాది కుటుంబాల్లో కన్నీళ్లు మిగిల్చింది. 2020లో కరోనా సృష్టించిన సంక్షోభానికి వేలాది మంది బలయ్యారు. ప్రత్యక్షంగా.. పరోక్షంగా లక్షలాది మంది జీవితాలు తలకిందులయ్యాయి. చాలామంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు జనాలు. కరోనా ఎఫెక్ట్‌తో ఏర్పడిన ఆర్థిక ఇబ్బందుల్ని తట్టుకోలేక వేలాది మంది అర్ధంతరంగా తనువు చాలించారు. 2020లో 8 వేల 761 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. కరోనావల్ల ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులు తాళలేక జీవితాల్ని పణంగా పెట్టారు. దేశంలో 2018-20 మధ్య ఏకంగా 25 వేల 251 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్ధిక ఇబ్బందులు, నిరోద్యోగం కారణంగా.. వీరంతా ఆత్మహత్యలకు పాల్పడినట్లు స్వయంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పార్లమెంట్‌లో వెల్లడించింది. 2018 – 2020 మధ్యకాలంలో 16,000 మందికి పైగా ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నారని కేంద్రం పేర్కొంది.

దీంతోపాటు.. 9,140 మంది నిరుద్యోగం కారణంగా బలవన్మరణాకి పాల్పడినట్లు కేంద్రం రాజ్యసభలో వెల్లడించింది. ఆర్ధిక ఇబ్బందులతో 2020లో 5,213 మంది, 2019లో 5,908 మంది, 2018లో 4,970 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు. నిరుద్యోగం కారణంగా 2020లో 3,548 మంది, 2019లో 2,851 మంది, 2018లో 2,741 మంది ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొన్నారు.కరోనా వేళ విధించిన లాక్‌డౌన్‌తో ఉద్యోగాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఆదాయ మార్గాలు ఒక్కసారిగా మూసుకుపోయాయి. నిరుద్యోగం పెరిగిపోయింది. కుటుంబాన్ని నెట్టుకొచ్చేందుకు తీసుకున్న అప్పులు భారంగా మారాయి. గత్యంతరం లేని పరిస్థితుల్లో అనేక మంది ఆత్మహత్యకు పాల్పడడం కలిచివేస్తోంది.

ఇదే క్రమంలో.. వలస జీవుల లెక్కల్ని సైతం వెల్లడించింది కేంద్రం. చనిపోయిన వలస కార్మికుల లెక్కలు అందుబాటులో లేవని చెప్పింది. ఫలితంగా వారికి పరిహారం అందించాలన్న ప్రశ్నే ఉత్పన్నం కాదని పేర్కొంది. కరోనా సమయంలో దాదాపు కోటి మంది వలస కార్మికులు తిరిగి సొంతింటికి చేరుకున్నారని వెల్లడించింది.ఆత్మహత్యల్ని నివారించేందుకు కేంద్రం నేషనల్‌ మెంటల్‌ హెల్త్‌ ప్రోగ్రామ్‌ను చేపట్టిందని వివరించింది హోంమంత్రిత్వ శాఖ. మానసిక కుంగుబాటును తగ్గించేందుకు ఈ ప్రోగ్రామ్‌ ఉపయోగపడుతుందని పేర్కొంది. నిరుద్యోగాన్ని తుదముట్టించేందుకు అనేక ప్రోగ్రామ్‌లను లాంచ్‌ చేసినట్టు చెప్పింది.

Leave A Reply

Your email address will not be published.