20 ఏళ్ళ తరువాత కేంద్ర మంత్రి అరెస్టు

ముంబై: దేశంలో రెండు దశాబ్ధాల తరువాత ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మంత్రిని అరెస్టు చేసింది. మహారాష్ట్రలోని శివసేన, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ మధ్య ఉప్పునిప్పులా ఉన్న విషయం తెలిసిందే.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరం తెలియని ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తన ముందు మాట్లాడినట్లయితే చెంప చెల్లు మన్పించేవాడినంటూ కేంద్ర మైక్రో అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్ శాఖ మంత్రి నారాయణ్ రాణే వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్యం వచ్చింది ఎప్పుడనేది కూడా సిఎం కు తెలియదని అన్నారు. ఈ వ్యాఖ్యలపై శివసేన కార్యకర్తలు కేసు పెట్టగా, ఆయనపై నాలుగు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. మూడు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు కాగా రత్నగిరి పోలీసు స్టేషన్ అధికారులు ఇవాళ రాణే ను అరెస్టు చేశారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఎంపీలకు అరెస్టు నుంచి రక్షణ ఉంటుంది. సమావేశాలు లేని సమయంలో లోకసభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్ అనుమతి తీసుకుని ఎంపీలను పోలీసులు అరెస్టు చేసే అధికారం ఉంటుంది. సివిల్ కేసులలో కేంద్ర మంత్రి అయితే సమావేశాల ప్రారంభానికి 40 రోజులు ముందు, సమావేశాలు ముగిసిన తరువాత అరెస్టు చేయవచ్చు. నారాయణ్ రాణేను అరెస్టు చేసే ముందు రాజ్యసభ ఛైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు అనుమతి తీసుకుని పోలీసులు అరెస్టు చేశారు. రాణే మహారాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా గతంలో పనిచేశారు. ముందస్తు బెయిల్ కోసం మంత్రి తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్ ను బాంబే హైకోర్టు తిరస్కరించింది. అంతకు ముందు రత్నగిరి కోర్టును ఆశ్రయించగా ఇదే విధంగా చుక్కెదురు ఎదురైంది.

Leave A Reply

Your email address will not be published.