తాలిబన్ పై తొలి వేటేసిన అమెరికా
వాషింగ్టన్: ఆఫ్ఘనిస్తాన్ ను కైవసం చేసుకున్న ఆనందం ఆవిరి అయ్యేలా తాలిబన్లపై అమెరికా ప్రభుత్వం వేటేసింది. అమెరికా బ్యాంకులలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం నిధులు తాలిబన్లకు చెందకుండా ఆర్థికంగా సంకెళ్లు వేసింది.
అమెరికాలోని బ్యాంకుల్లో ఉన్న నిధులను ఫ్రీజ్ చేస్తున్నట్లు వైట్ హౌస్ అధికారికంగా ప్రకటించింది. తాలిబన్లకు అందకుండా ఉండేందుకు యుఎస్ ట్రెజరీ ఫెడరల్ రిజర్వ్, అమెరికా బ్యాంకుల్లోని ఆఫ్ఘనిస్తాన్ నిధులపై ఆంక్షలు విధించింది. సుమారు 9.5 బిలియన్ డాలర్ల మేర నిధులు నిల్వ ఉన్నాయి. ఈ నిధులను తాలిబన్లు డ్రా చేసుకుని దుర్వినియోగం చేసుకునే ప్రమాదం ఉందని పసిగట్టిన అమెరికా ప్రభుత్వం తొలి చర్యకు ఉపక్రమించింది. తాలిబన్లను నియంత్రించేందుకు అధ్యక్షుడు జోసెఫ్ ఆర్.బైడెన్ ప్రభుత్వం ఇతర చర్యలను ఆలోచిస్తున్నదని వైట్ హౌస్ తెలిపింది. తాలిబన్ల రాకతో ఆఫ్ఘన్ కరెన్సీ ఎన్నడూ చూడని విధంగా నష్టాలను చవిచూస్తున్నది. బ్లూమ్ బర్గ్ డేటా ప్రకారం మంగళవారం 4.6 శాతం పడిపోయింది.