జలజగడంపై జగన్ లేఖలు

జలజగడంపై జగన్ లేఖ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్‌, పర్యావరణ మంత్రి జవదేకర్‌కు లేఖ రాశారు. ఈ లేఖలో తెలంగాణపై ఆయన కీలక వ్యాఖ్యలే చేశారు. తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం, సాగర్‌, పులిచింతల జలాలను విద్యుదుత్పత్తికి వాడుకుంటోందని, కేఆర్‌ఎంబీ ఆదేశించినా వినకుండా జలాలను వినియోగించుకుంటోందని ఆ లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ తీసుకొచ్చిన 34 జీవో పునర్విభజన చట్టానికి వ్యతిరేకమన్నారు. రాయలసీమకు నీరందించేందుకు ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నామని, అదనపు ఆయకట్టు లేదని, కేటాయించిన నీటినే వాడుకుంటామన్నారు.

 

తెలంగాణ అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవాలని కేఆర్‌ఎంబీకి లేఖలు రాసినా పట్టించుకోలేదని సీఎం జగన్ పేర్కొన్నారు. పాలమూరు – రంగారెడ్డి, డిండి, కల్వకుర్తి, ఎస్‌ఎల్‌బీసీ పథకాలు నిబంధనలకు విరుద్ధమన్నారు. అక్రమ ప్రాజెక్ట్‌ల నిర్మాణాన్ని తెలంగాణ ప్రభుత్వం వేగవంతం చేసిందన్నారు. అక్రమ ప్రాజెక్టులను సందర్శించి నిలిపివేయాలని కోరినా కేఆర్‌ఎంబీ వెళ్లలేదని పేర్కొన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పనుల వద్దకు వస్తామని లేఖలు రాస్తున్నారని, తమ వద్దకు వచ్చే ముందు తెలంగాణ ప్రాజెక్టులను సందర్శించాల్సిందేనని సీఎం జగన్‌ అన్నారు.

 

అక్కడ ప్రాజెక్టులను సందర్శించకుండా ఇక్కడకు రావాల్సిన అవసరం లేదని సీఎం జగన్ స్పష్టం చేశారు. కేఆర్‌ఎంబీ పరిధిని నోటిఫై చేయాలన్నారు. ఇరు రాష్ట్రాల ప్రాజెక్టులు, రిజర్వాయర్లను కేఆర్‌ఎంబీ పరిధిలోకి తీసుకెళ్లాలని, రిజర్వాయర్లకు కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరారు. తటస్థంగా ఉండాల్సిన కేఆర్‌ఎంబీ అధికారులు తెలంగాణకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ అంశంపై కేఆర్‌ఎంబీ అధికారులకు తగిన సూచనలు చేయాలని కోరారు. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలని సీఎం జగన్‌ ఆ లేఖలో కోరారు.

Leave A Reply

Your email address will not be published.