అవసరం తీరే వరకే అన్న.. అవసరం తీరాక దున్న

సీఎం జగన్ రెడ్డి తీరు పై నిప్పులు చెరిగిన యనమల
అమరావతి ఫిబ్రవరి 16: ఉద్యోగులను వాడుకుని వదిలేయడంలో సీఎం జగన్ రెడ్డి టాప్ అని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తెలిపారు. అడ్డూ అదుపూ లేని అప్పులతో ఆర్ధిక వ్యవస్థ గాడి తప్పింది.  అవసరం తీరే వరకే అన్న.. అవసరం తీరాక దున్న అన్నట్లు జగన్ వైఖరి ఉందన్నారు. ఉద్యోగులు, పోలీసుల పట్ల జగన్ రెడ్డి వ్యవహారం దుర్మార్గమన్నారు. ప్రతిపక్షాల అక్రమ అరెస్టులకు అడ్డగోలుగా వాడుకుని.. అవమానకర రీతిలో సవాంగ్‌ను గెంటేశారని యనమల తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘‘డీజీపీ స్థాయి వ్యక్తికి పోస్టింగ్ ఇవ్వకుండా అవమానించారు.

సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంను అన్నా అంటూనే.. గెంటారు. పీవీ రమేష్, అజేయకల్లాం రెడ్డికి పొమ్మనకుండా పొగబెట్టారు. అజేయకల్లాంతో న్యాయమూర్తులపై విషం కక్కించి తర్వాత పంపేశారు. చీకటి జీవోల ఆధ్యుడు ప్రవీణ్ ప్రకాశ్ ను ఆకస్మికంగా ఢిల్లీ తరిమేశారు. జగన్ రెడ్డి వ్యవహారశైలిని, నైజాన్ని ఉద్యోగులు, పోలీసులు అర్ధం చేసుకోవాలి. ఆస్తులు తాకట్టు పెట్టి, భూములు అమ్మి భారీగా ఆదాయం సమకూర్చుకున్నారు. ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు కూడా ఇవ్వలేని స్థితిలో రాష్ట్రం ఉందన్నారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేశారన్నారు. జగన్ రెడ్డి దుబారా, లూటీతో రాష్ట్రం ఆర్ధికంగా దివాళా తీసింది. కరోనాను బూచిగా చూపించి ఎడాపెడా అప్పులు చేస్తున్నారు. రాష్ట్రంలో ఆర్ధిక సంక్షోభాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 360 ప్రకారం రాష్ట్రంలో ఆర్ధిక ఎమర్జెన్సీ విధించాలి’’ అని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.