డ్రగ్స్ కట్టడికి పోలీస్ స్టేషన్

హైదరాబాద్, ఫిబ్రవరి 4, (న్యూస్ పల్స్): రాష్ట్రంలో డ్రగ్స్‌ నియంత్రణకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం నార్కోటిక్, ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ కంట్రోల్‌ సెల్‌ ఏర్పాటుపైపై పోలీస్‌ శాఖ రూపకల్పన చేస్తోంది. అందులో భాగంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్న విభాగాలపై అధ్యయనం చేస్తున్న పోలీస్‌ శాఖ పటిష్టమైన ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. డ్రగ్స్, వ్యవస్థీకృత నేరాలను నియంత్రించేందుకు రూపుదిద్దుకోబోతున్న విభాగానికి ప్రత్యేకంగా పోలీస్‌ స్టేషన్‌ హోదా కలిగి ఉండాలని భావిస్తోంది.ఎందుకంటే ప్రత్యేకమైన నేరాలను విచారించబోతున్న ఈ విభాగానికి కేసు నమోదు చేసుకొని చార్జిషీట్‌ వేసే అధికారం కల్పిస్తేనే వ్యవస్థీకృత నేరాలను అదుపు చేయడం సులభతరం అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో ఉన్న నేర పరిశోధన విభాగం (సీఐడీ), అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) లాగా నార్కోటిక్, ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ కంట్రోల్‌ సెల్‌ (ఎన్‌ఓసీసీసీ) విభాగం కూడా విధులు నిర్వర్తించేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్టు తెలిసింది. ఇలా పోలీస్‌స్టేషన్‌ ఏర్పాటు చేసుకుంటే రాష్ట్రంలో ఎక్కడ డ్రగ్స్, సంబంధిత ఇతర నేరాల కేసులు నమోదు చేసే అధికారం, స్థానిక పోలీస్‌స్టేషన్ల నుంచి కేసులు బదలాయించుకొని విచారణ చేసే అధికారం ఈ యూనిట్‌కు ఉంటుంది.

ఎస్‌హెచ్‌ఓ (స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్‌)గా డీఎస్పీ ర్యాంకు అధికారిని నియమించుకునేలా నిబంధనలు రూపొందిస్తున్నట్టు తెలిసింది. అదేవిధంగా ప్రతీ జిల్లాలో ఒక ఎన్‌ఓసీసీసీ (నార్కోటిక్, ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ కంట్రోల్‌ సెల్‌) ఏర్పాటు చేయాలని, దీనివల్ల తీవ్రత కిందిస్థాయి వరకు వెళ్తుందని, నిందితుల్లోనూ భయం ఉంటుందని పోలీస్‌ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. సీఐడీ, ఏసీబీలాగే జిల్లాల వారీగా యూనిట్లు ఏర్పాటుచేసి, డీఎస్పీ ర్యాంకు అధికారి నేతృత్వంలో కార్యాలయాలు ఉండేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్టు తెలిసింది. అయితే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో మాత్రం అదనపు డీసీపీ/అదనపు ఎస్పీ నేతృత్వంలో యూనిట్లు ఉండేలా చర్యలు తీసుకోనున్నట్టు తెలిసింది.వెయ్యి మందితో ఏర్పాటు చేయాలని భావిస్తున్న ఎన్‌ఓసీసీసీకి తొలిదశలో 350–400 మందిని నియమించాలని భావిస్తున్నారు.

ఇందులో 85 శాతం మందిని పోలీస్‌ శాఖ నుంచి, మిగిలిన 15 శాతం ఎక్సైజ్‌ విభాగం నుంచి డిప్యుటేషన్‌పై తీసుకునేలా నిబంధనలు రూపొందిస్తున్నారు. కానిస్టేబుల్‌ నుంచి ఎస్‌ఐ ర్యాంకు అధికారి వరకు కనీసం మూడేళ్లు, సీఐ ర్యాంకు అధికారిని రెండేళ్లపాటు డిప్యుటేషన్‌పై తీసుకుంటారని తెలిసింది. ఇలా పలు దఫాలుగా సిబ్బందిని పెంచుకుంటూ వెయ్యి మందితో పూర్తిస్థాయి విభాగంగా మార్చాలని భావిస్తున్నారు. కొత్త సెల్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలను పూర్తిస్థాయిలో రూపొందించి నాలుగు రోజుల్లో ప్రభుత్వానికి పంపనున్నట్టు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఒకరు తెలిపారు. ముందుగా విభాగం ఏర్పాటుపై అదేశాలు వెలువడగానే, నియామకాలకు సంబంధించి ఆదేశాలు వెలువడతాయని చెప్పారు. ప్రతిపాదనలపై మరోసారి సీఎం కేసీఆర్‌తో చర్చించాల్సి ఉంటుందని, మార్పులు చేర్పులు, కార్యాలయాల ఏర్పాటు తదితర అంశాలపై ఆమోదం తీసుకోవాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు.

Leave A Reply

Your email address will not be published.