బాలకృష్ణ రాజీనామా తప్పదా

అనంతపురం, ఫిబ్రవరి 5: డైలాగులు చెప్పడానికి బాగానే ఉంటాయి. అందులో అఖండ లాంటి సినిమాలో అలవోకగా డైలాగులు చెప్పిన బాలకృష్ణ ఇంకా ఆ జోష్ నుంచి బయటకు రాలేదనే అనిపిస్తుంది. హిందూపురం జిల్లాలో ఈరోజు పర్యటించిన బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేయడమే ఇందుకు కారణం. మరోసారి భారీ డైలాగులు కొట్టారు. హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బాలకృష్ణ ప్రకటించారు.ఇప్పుడున్న పరిస్థితుల్లో బాలకృష్ణ ఆ సాహసం చేయగలరా? సినిమా కాదు. చపట్లు అందుకోవడానికి ఈ డైలాగు కొట్టి ఉండవచ్చు. కానీ ఆచరణలో ఇప్పుడు సాధ్యం కాని పని. తెలుగుదేశం పార్టీ పరిస్థితి అంత బాగా లేదు. ఇప్పుడు బాలకృష్ణ చేసిన డిమాండ్ ను ప్రభుత్వం పరిశీలించే పరిస్థితి కూడా లేదు. పుట్టపర్తినే జిల్లా కేంద్రంగా కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకకుంటే బాలకృష్ణ నిజంగా రాజీనామా చేస్తారా? అన్నది సందేహమే. ఇప్పుడున్న పరిస్థితుల్లో…. ఇక ఎన్నికలకు రెండేళ్లు మాత్రమే సమయం ఉంది. మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ హిందూపురంలో వైసీపీ విజయం సాధించింది.

ఈ పరిస్థితుల్లో బాలకృష్ణ రాజీనామా చేయడం అనేది జరగని పని. మరో వైపు చంద్రబాబు రాజీనామా చేసి తిరిగి ఉప ఎన్నికలకు వెళ్లేందుకు అస్సలు అంగీకరించరు. గత ఎన్నికల్లోనే అనంతపురం జిల్లాలో హిందూపురం, ఉరవకొండ నియోజకవర్గాలు మాత్రమే టీడీపీ గెలిచింది. హిందూపురంలో టీడీపీ బలంగా ఉండవచ్చు. సాధారణ ఎన్నికలు వేరు. ఉప ఎన్నికలు వేరు. బాలకృష్ణ తన అభిమానులను అలరించడానికి, మురిపించడానికి ఇలాంటి రాజీనామా డైలాగ్ ను కొట్టి ఉండవచ్చు. కానీ అది ఆచరణ సాధ్యం కాదు. రేపు నిజంగా హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రభుత్వం ప్రకటించకపోతే ఆ డైలాగ్ కు విలువ లేకుండా పోతుంది. అయితే తొలిసారి బాలకృష్ణ ఇలా రాజీనామా ప్రకటన చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరి రాజీనామా వ్యవహారం డైలాగుగా మిగిలిపోతుందా? లేక నిజంగా హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించకుంటే రాజీనామా చేస్తారా? అన్నది చూడాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.