చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నా..: సీపీఐ నారాయణ

మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రకటించారు. వాటిని భాషా దోషంగా భావించాలని, తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని చెప్పారు. మెగా అభిమానులు, కాపునాడు మహానుభావులు ఈ వ్యాఖ్యలు ఇంతటితో మరిచిపోవాలని నారాయణ కోరారు. సోమవారం తిరుపతిలో మీడియాతో మాట్లాడిన నారాయణ… చిరంజీవి, పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు.

అల్లూరి సీతారామరాజు జయంతి రోజున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరై భీమవరంలో నిర్వహించిన అల్లూరి విగ్రహావిష్కరణ సభకు సూపర్‌ స్టార్‌ కృష్ణను ఆహ్వానిస్తే బాగుండేదని, కానీ అలా కాకుండా ఊసరవెల్లిలా ప్రవర్తించే చిరంజీవిని సభా వేదికపైకి తీసుకురావడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. ఇక పవన్‌ కళ్యాణ్‌ ల్యాండ్‌మైన్‌ లాంటి వారని, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో ఆయనకే తెలియదని నారాయణ ఎద్దేవా చేశారు.

నారాయణ వ్యాఖ్యలపై చిరంజీవి, పవన్ అభిమానులు.. జనసేన కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో నారాయణను ట్రోల్ చేస్తున్నారు. నారాయణ వ్యాఖ్యలకు నాగబాబు కౌంటర్ ఇచ్చారు. ‘నారాయణ అనే వ్యక్తి చాలాకాలం నుండి అన్నం తినడం మానేసి కేవలం గడ్డి మరియు చెత్తా చెదారం తింటున్నారు. కాబట్టి మన మెగా అభిమానులంతా అతనితో గడ్డి తినడం మాన్పించి.. కాస్త అన్నం పెట్టండి’ అని కామెంట్ చేశారు. అయితే, నారాయణ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడంతో ఈ గొడవకు పుల్ స్టాప్ పడినట్టు అయింది.
CPI Narayana, Chiranjeevi, Pawan Kalyan, comments, Janasena

Leave A Reply

Your email address will not be published.