వేరియంట్లను ముందే గుర్తించవచ్చు

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. రెండేళ్ల నుంచి కార్చిచ్చులా వ్యాపిస్తూనే ఉంది. అంతే కాకుండా రూపం మార్చుకుని వేరియంట్ల మాదిరి తెగబడుతోంది. వైరస్ మూలాల్లో వివిధ రకాల ఉత్పరివర్తనాలు జరుగుతూ కొత్త రకం గా రూపాంతరం చెందుతుంది. వాటిలో కొన్ని ప్రమాదకర వైరస్ లు ఉన్నాయి. అయితే వీటిని తీవ్రతను అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. వేరియంట్లను ముందే గుర్తించడం పై అధ్యయనం చేస్తున్నారు.డెల్టా వేరియంట్ ప్రభావం తో వైరస్ కొత్త రూపాంతరాలను ముందే అంచనా వేస్తే… తీవ్రతను తగ్గించవచ్చునని వైద్య నిపుణులు భావిస్తున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు రూపాంతరం చెందుతున్న కొవిడ్-19 అసలు వైరస్ సార్స్ కోవ్ 2 పై అనేక పరిశోధనలు చేస్తున్నారు. అయితే ప్రజలు వాడి వదిలేసిన వ్యర్థాలను పరీక్షించాలని న్యూయార్క్ పరిశోధకులు నిర్ణయించారు.

ఆ దిశగా నగరంలోని వ్యర్థ నీటితో పరిశోధనలు మొదలుపెట్టారు. 14 మురుగు నీటి కేంద్రాల్లోని వ్యర్థాలను పరీక్షించారు. కాగా రోగుల విసర్జితాల్లో ఉన్న వైరస్ ఆ నీటిలో కలిసినట్లు గుర్తించారు.వ్యర్థ జలాల్లో ఆల్ఫా బీటా ఎప్సిలాన్ అయోటా డెల్టా కప్పా గామా వేరియంట్లను గుర్తించినట్లు న్యూయార్క్ పరిశోధకులు చెప్పారు. అంతేకాకుండా ఇప్పటివరకు పరిశోధనలో తేలని ఇతర రకాల వేరియంట్లను గుర్తించినట్లు చెప్పారు. వాటిని నిగూఢ రకాలుగా పేర్కొన్నారు. ఆర్టీ క్యూసీపీఆర్ పరీక్షల ద్వారా ఇవి గుర్తించినట్లు చెప్పారు. అయితే వీటి మూలాలపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదని పేర్కొన్నారు. వ్యాప్తిలో ఉన్న వేరియంట్లకు ఇవి భిన్నంగా ఉన్నాయి. వీటిని జీఐఎస్ఏఐడీ ఎపికోవ్ డేటాబేస్ లో వైరస్ జన్యుక్రమం భద్రపరుస్తుండగా… అక్కడ వీటికి సంబంధించిన డేటా లేదు. కాగా ఇవి ఒమిక్రాన్ వేరియంట్ కు దగ్గరగా ఉన్నట్లు పరిశోధనల్లో వెల్లడైందని చెప్పారు.కొత్త వేరియంట్ల మూలాలపై ఇంకా అధ్యయనాలు జరుగుతున్నాయి. అవి జంతువుల నుంచి పుట్టి ఉంటాయని భావిస్తున్నారు. మురుగు నీటిలో తిరిగే ఎలుకల వల్ల ఈ కొత్త రకాలు ఉద్భవించినట్లు అనుమానిస్తున్నారు. మరో నగరంలోని వ్యర్థ జలాల్లో పరిశోధన జరిపారు. అక్కడ కూడా కొత్త వేరియంట్లు కనిపించాయని చెప్పారు.

కాగా అవి మొదట కనుగొన్న వాటికి భిన్నంగా ఉన్నాయని చెప్పారు. వీటివల్ల మనకు ముప్పు ఉందా? లేదా అనే దానిపై ఇంకా అధ్యయనం జరుగుతోంది. ఇప్పటి వరకైతే క్లారిటీ రాలేదని చెబుతున్నారు. అయితే భవిష్యత్తులో వచ్చే ప్రమాదకర వేరియంట్ల గురించి ఇవి తెలియజేస్తాయి అంటున్నారు. వీటిని ఉపయోగించి కొత్త వేరియంట్ల తీవ్రత ఎంతవరకు అనేది అంచనా వేయవచ్చునని అభిప్రాయపడుతున్నారు. ఈ విధంగా వ్యర్థ జలాల పరిశోధనలతో వైరస్ కొత్త వేరియంట్లను ముందుగానే పసిగట్టవచ్చునని న్యూయార్క్ శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.