దక్షిణాఫ్రికా తాజా మార్గదర్శకాలు

ఒమిక్రాన్ వేరియంట్ వెలుగు చూసిన దక్షిణాఫ్రికాలో కరోనా నిబంధనలు సరళతరమయ్యాయి. కరోనా పాజిటివ్‌గా తేలినా లక్షణాలు లేకుంటే ఐసోలేషన్ అవసరం లేదని ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. అంతేకాదు, పాఠశాలల్లో విద్యార్థుల మధ్య ఒక మీటరు భౌతికదూరం కూడా అవసరం లేదని తేల్చి చెప్పింది. దీంతో రెండేళ్లుగా పాఠశాలల్లో అమల్లో ఉన్న భౌతిక దూరం నిబంధనలకు చరమగీతం పాడింది. వైరస్ ఉద్ధృతి తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ప్రభుత్వం కరోనా నిబంధనల్లో మార్పులు చేసింది.

ప్రభుత్వ తాజా నిబంధనల ప్రకారం.. పాజిటివ్‌గా తేలి లక్షణాలు లేకుంటే ఐసోలేషన్ అవసరం లేదు. లక్షణాలు ఉంటే మాత్రం ఏడు రోజులు ఐసోలేషన్ తప్పనిసరి. గతంలో ఇది పది రోజులుగా ఉండేది. కరోనా రోగులతో సన్నిహితంగా మెలిగిన వారిలో లక్షణాలు లేకుంటే వారు కూడా ఐసోలేషన్‌లో ఉండాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.

దేశంలోని 60 నుంచి 80 శాతం మంది ప్రజల్లో కొవిడ్‌ను ఎదుర్కోగలిగే రోగనిరోధక శక్తి ఉన్నట్టు సీరో సర్వే నిర్ధారించడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నిబంధనలు సడలించిన ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో మాత్రం మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేసింది. అలాగే, టీకా తీసుకోని వారు వెంటనే ఆ పని చేయాలని కోరింది.

Leave A Reply

Your email address will not be published.